సోఫాలో కుప్పకూలిన కొడాలి నాని .. గుడివాడకు బయల్దేరిన కుటుంబ సభ్యులు

 


వైసీపీ సీనియర్ నేత , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్ధతకు గురయ్యారు. పట్టణంలోని తన స్వగృహంలో గురువారం నందివాడ మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన కార్యకర్తలు, గన్‌మెన్లు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పరుగుపరుగున కొడాలి నాని చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉండగా.. విషయం తెలిసి గుడివాడకు బయల్దేరారు. అటు స్థానిక నేతలు, కార్యకర్తలు సైతం కొడాలి నానికి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత రెండు నెలలుగా తీరిక లేకుండా గడిపారు కొడాలి నాని. ఈ నేపథ్యంలో ఒత్తిడికి తోడు ఎండ వేడిమి కారణంగానే ఆయన అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. పోలింగ్ రోజున కూడా కొడాలి నాని ఆలస్యంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని కోలుకున్నారు.

ఇకపోతే .. దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా గుడివాడను అడ్డాగా చేసుకుని ఏలుతున్న కొడాలి నాని తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి టఫ్ ఫైట్‌ని ఎదుర్కొంటున్నారు. ఆయనను ఎలాగైనా ఓడించాలని ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముని తెలుగుదేశం పార్టీ బరిలో దించింది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రాము ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీకి కమ్మ సామాజిక వర్గంతో పాటు పవన్ కళ్యాణ్ ద్వారా కాపు సామాజిక వర్గం , ఆయన అభిమానుల బలం కూడా కలిసొచ్చింది. 

వెనిగండ్ల రాము గుడివాడలో చాలామంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో ఆయా వర్గాల్లో మంచిపేరు సంపాదించారు. జగన్ కేబినెట్‌లో నాని మంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పైగా ఎప్పుడూ చూసినా సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. చంద్రబాబు, లోకేష్‌, టీడీపీలను తిట్టడంతోనే కొడాలి నాని కాలం గడిపారు. దీంతో కమ్మ సామాజికవర్గం ఆయనపై గుర్రుగా ఉంది. 

అంతేకాదు.. గుడివాడలో బలంగా ఉన్న కాపులు కూడా కొడాలి నానిపై ఆగ్రహంతో ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. దీంతో ఈసారి గుడివాడలో కొడాలి నానికి ఎదురుగాలి తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కొడాలి నానికి ఉన్న మాస్ ఇమేజ్.. స్థానికుడు కావడంతో ప్రజలు మరోసారి ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. 


Comments